
- ఏఎంఆర్పీ కాల్వల ద్వారా
- నీటిని విడుదల చేయాలి మాజీ మంత్రి,
నల్గొండ అర్బన్, వెలుగు: ఎస్ఎల్బీసీపై కేసీఆర్ క్షుద్రపూజలు చేయించిండని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని, మూఢ నమ్మకాలను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన ఆయనకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డికి దందాలు చేసుడు, కమీషన్లు, కాంట్రాక్టులు తప్ప వేరే సోయి లేదని విమర్శించారు. మంగళవారం నల్గొండలోని బీఆర్ఎస్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమ్మార్పీ కాల్వల ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నింపేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాగర్ నిండు కుండలా మారిందని, మంత్రులు నీటి విడుదలపై దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, మంత్రులకు హెలికాప్టర్ల మీద ఉన్న సోకు, రైతుల మీద ప్రేమ లేదని మండిపడ్డారు. బనకచర్లతో గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
కనీసం ఉదయ సముద్రం కూడా నింపలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిరా పంకజ్ యాదవ్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.