పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మంత్రి, పోలీసుల వేధింపులు భరించలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. బాధితుని వాంగ్మూలం తీసుకొని ఎమ్మారో, ఆర్డీఓ, సీఐ, డీఎస్పీని సస్పెండ్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పీడీ యాక్టు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఖమ్మం జిల్లాలో మూడేళ్ల నుంచి మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ అజయ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. ఆయనకు కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. పువ్వాడపై చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమని జగ్గారెడ్డి హితవు పలికారు. పోలీసులపై విశ్వాసం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు.