
- అందుబాటులో ప్రజాప్రతినిధుల ప్రోగ్రామ్‌లో ఎమ్మెల్యే కసిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్ లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ప్రోగ్రామ్‌లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరగా పరిష్కరించాలని సూచించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలు వస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మూసీ గురించి రివ్యూ చేస్తున్నారని హరీశ్ రావు అనడంపై ఫైర్ అయ్యారు. భారీ వర్షాలకు మూసీతో పాటు జంట జలాశయాలు నిండిపోవడంతో ముందు జాగ్రత్త చర్యలపై, అధికారులను అప్రమత్తం చేసేందుకు సీఎం రివ్యూ చేశారని వివరించారు. దీన్ని కూడా హరీశ్ రావు తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్ని విషయాలపై అవగాహన ఉందని, వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు.