
శంకరపట్నం, వెలుగు: ప్రభుత్వం లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నం కేజీబీవీని సందర్శించారు. స్టూడెంట్స్ లంచ్ కోసం క్యూలో ఉండగా.. వారితో కలిసి భోజనం చేశారు. కూరలు రుచిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన మెనూను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమను కుక్ రేణుక వేధిస్తోందంటూ ఎమ్మెల్యే ఎదుట కన్నీరుపెట్టుకున్నారు.
తమతో పనులు చేయించుకుంటూ, బెదిరిస్తోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కేజీబీవీ కోఆర్డినేటర్‌తో ఫోన్‌లో కుక్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. క్లాస్ రూమ్‌ల్లోకి వెళ్లి పాఠాలు బోధించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి, ఫార్మసీ, ల్యాబ్‌లను తనిఖీ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ సురేఖ ఉన్నారు.