జైల్లో ఉన్న బిడ్డపై ప్రేమ లేనోడికి..ప్రజలంటే ప్రేమ ఉంటుందా! : రాజగోపాల్ రెడ్డి

జైల్లో ఉన్న బిడ్డపై ప్రేమ లేనోడికి..ప్రజలంటే ప్రేమ ఉంటుందా! :  రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి/నార్కట్​పల్లి/చండూరు, వెలుగు: తెలంగాణను ముక్కలుగా చేసి అల్లుడికో జిల్లా, కొడుకుకో జిల్లా ఇచ్చి కేసీఆర్​ ఆగం చేసి అప్పుల పాలు చేసిండని భువనగిరి పార్లమెంట్  ఇన్​చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. జైల్లో ఉన్న బిడ్డపై ప్రేమ లేనోడికి ప్రజలంటే ప్రేమ ఉంటుందా? అని ప్రశ్నించారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల, వలిగొండలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్  నేతి విద్యాసాగర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్​ స్కామ్​లో అరెస్ట్  అయి కూతురు కవిత జైల్లో ఉంటే ఓట్లు అడగడానికి కేసీఆర్​కు మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. బిడ్డ అంటే ప్రేమ లేని ఈ కేసీఆర్​కు ప్రజల మీద ప్రేముంటుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కవిత ఒక్కతే కాదని, కేసీఆర్  కుటుంబం త్వరలో జైలుకు పోతుందని చెప్పారు. బీఆర్ఎస్​ లెక్క కొడుకు, కూతురు, అల్లుడి కోసం కాకుండా ప్రజల కోసమే  కాంగ్రెస్​ పని చేస్తుందని తెలిపారు. 

కమీషన్ల కోసం రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలిపోయిందని తెలిపారు. ఈ పదేండ్లు పొట్టి మంత్రి (జగదీశ్​రెడ్డిని ఉద్దేశించి) ఏం చేసిండని ప్రశ్నించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో చామల కిరణ్​కుమార్​రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. దుబ్బాక నరసింహారెడ్డి, గుత్తా జితేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు.