వైన్స్ల సమయాల్లో మార్పు ఉండదు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వైన్స్ల సమయాల్లో మార్పు ఉండదు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని వైన్స్​ల సమయాల్లో మార్పు ఉండదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడులోని క్యాంప్​ఆఫీస్​లో ఆయనను కలవడానికి వచ్చిన మద్యం వ్యాపారులతో మాట్లాడారు. మీ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పాడుచేయొద్దన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే షాపులు తెరుచుకోవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లోకి అనుమతి ఉండాలని చెప్పారు.

అవసరమైతే నియోజకవర్గంలో డ్రంకెన్​డ్రైవ్ కేసులను పెంచుతామని, ఉదయమంతా పని చేసుకొని సాయంత్రం పూట మాత్రమే తాగేలా మార్పు తీసుకొస్తామని పేర్కొన్నారు. మద్యం విచ్చలవిడిగా లభ్యమవడం వల్ల పనులు మానుకొని అదే పనిగా తాగుతూ చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని, యువత మద్యానికి బానిసై పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితులలో నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలన, మద్యం నియంత్రణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 

అభివృద్ధి కోసం గతంలో రాజీనామా చేశా

చండూరు, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్లాడితే నిధులివ్వలేదని, తన రాజీనామాతోనే అప్పటి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో నిర్మించిన మెయిన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ను ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చండూర్ లో100 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని, హైదరాబాద్​ తరహాలో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వాలని సీఎం రేవంత్​రెడ్డిని కలిశానని తెలిపారు.