భూదాన్ పోచంపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూదాన్ పోచంపల్లి మండలంలో అన్ని గ్రామాలను హెచ్ఎండీఏ నిధుల ద్వారా, ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం 10 ఏళ్ల హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేశామని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో పేదవారి ఇంటి కల నెరవేరిందని వారు తెలిపారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి దిశగా మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, వెంకటేశం, రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

