పేదల కలను సాకారం చేస్తున్న సర్కార్: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పేదల కలను సాకారం చేస్తున్న సర్కార్: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పేదొళ్ల కలను రాష్ట్ర ప్రభుత్వం  సాకారం చేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్​లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో కొత్తగా సాంక్షన్​ అయిన రేషన్​కార్డులను కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​తో  కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో 4,633 కొత్త రేషన్​కార్డులు మంజూరు అయ్యాయన్నారు. 

పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు. కలెక్టర్​ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్​ కార్డు వస్తుందని చెప్పారు. అర్హులై ఉండి ఇంకా ఎవరికైనా రేషన్​ కార్డు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

పాల్వంచ : మండలంలోని జగన్నాథపురం లో ఉన్న పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో మండలంలోని 1,500 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త గూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్  శ్రీనివాస రావు పాల్గొన్నారు.