లింగంపేట, వెలుగు : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్లు పని చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు సూచించారు. శుక్రవారం లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పని చేస్తూ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లకు అండగా ఉంటానని, ఏ సమస్య ఉన్నా సంప్రదించాలన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల కోసం అసెంబ్లీలో విన్నవిస్తున్నానని, గత పాలకులు ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడారా.. అని ప్రశ్నించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటానన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం రికార్డు సాధించిందన్నారు. 209 గ్రామపంచాయతీలకు 176 జీపీలలో కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచారన్నారు. వీటిలో 46 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్నారు.
రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం 176 పంచాయతీల పాలకవర్గాలను ఎమ్మెల్యే సన్మానించారు.
