- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రజల సౌకర్యం కోసం ఐదు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నేషనల్ హైవే అథారిటీ, కాంట్రాక్ట్ సంస్థ, ట్రాఫిక్, పోలీసు అధికారులతో కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు జాతీయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి సాకి చెరువు వరకు ఐదు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పారు. అశోక్ నగర్, బీరంగూడ ఐఐటీ, ఆర్సీపురం రైల్వే లైన్, పటాన్చెరు బస్టాండ్, సాకి చెరువు ప్రాంతాల్లో వీటిని నిర్మించబోతున్నట్లు వివరించారు.
నిర్ధేశిత గడుపు లోపు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ డీఈ రామకృష్ణ, డీఎస్పీ ప్రభాకర్, సీఐలు వినాయక్ రెడ్డి, లాలూ నాయక్, ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శాస్ర్తీ, రమేశ్ పాల్గొన్నారు.
