- కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి హామీ
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. భూబాధితులకు ప్రభుత్వం తప్పకుండా పరిహారం ఇచ్చి అండగా నిలుస్తుందన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో 239 ఎకరాల్లో నిర్మించబోయే అంతర్జాతీయ పండ్ల మార్కెట్ పనులను మల్కాజిగిరి సీపీ సుమతితో కలిసి మంగళవారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 3న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రాబోతున్నాయని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రాజకీయ పార్టీల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు.
కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. బాధితులకు న్యాయమైన పరిహారం అందిస్తామని, శంకుస్థాపన కార్యక్రమానికి రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతతో పాటు, సంఘీ టెంపుల్ సమీపంలో 30 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుమతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, డీసీపీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
19 మంది రైతులు అరెస్ట్
కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు సుమారు 19 మందిని ఉదయాన్నే అరెస్ట్ చేసి నాగోల్ పీఎస్‌కు తరలించారు. తమ తాతల కాలం నాటి భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కోహెడ మార్కెట్ పనుల పరిశీలనకు వస్తున్న నేపథ్యంలోనే రైతుల అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచి బందోబస్తు ఏర్పాటు చేశారని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ గోడు చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదన్నారు. బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు.
