
పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు: క్రమ శిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీలో గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హెచ్చరించారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పులలో నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే, పార్టీ నియోజక ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు.
కొంతమంది పార్టీలో ఉంటూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, నిజమైన కార్యకర్తలను కాపాడుకుంటామని, అనవసర రాద్ధాంతాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్నియోజకవర్గ అధ్యక్షుడు ధారావత్ రాజేశ్‌నాయక్, మండలాధ్యక్షుడు నల్లా శ్రీరాములు, ఇన్చార్జి అందె యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి నిధులు కేటాయించండి
తొర్రూరు: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ఆమె, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడితో కలిసి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అభివృద్ధి పనులకు తక్షణమే రూ.50 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలని కోరారు.