
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వాటా 13 శాతం ఉన్నా ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా జీఎంఆర్ సంస్థ నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు బడ్జెట్‌లో ప్రోత్సహాకాలు పెంచలేదని మండిపడ్డారు. గతంలో ఇన్‌సెంటివ్స్ రూపంలో రూ.1,400 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే పెట్టారని, దీంతో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
‘‘వడ్డెర కమ్యూనిటీకి డీఎంఎఫ్ ఫండ్‌కు చేయూత ఇవ్వాలి. కుమ్మర కమ్యూనిటీకి వారి ఉత్పత్తుల ఇండియన్ రైల్వే తరహాలో మట్టి కప్‌లను ప్రోత్సహించాలి. ముచ్చర్లలో పెట్టిన ఫార్మాసిటీని వేరే రంగాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాలుష్యం పేరుతో ఫార్మాసిటీని ఎక్కడా పెట్టనీయని పరిస్థితి ఏర్పడుతోంది. కోడంగల్‌లోనూ అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్ వంటి అనేక జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇదే ప్రాంతాల్లో స్కిల్ సిటీని తీసుకురావాలి” అని ఆయన కోరారు.