పెనుబల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వ కొత్త బిల్లుతో ఉపాధి హామీకి గండిపడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. గురువారం పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో 38 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ. 11,51,500 విలువైన చెక్కులు, 101 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు పని కల్పించడమే లక్ష్యంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
కొత్తగా తెచ్చిన బిల్లులతో పేదలకు వచ్చే కూలి సగానికి పడిపోతుందని, ఈ అన్యాయంపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. అనంతరం లంకపల్లి గ్రామంలో జరిగిన సీఎం కప్ క్రీడలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
