
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపాటు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు చేతనైతే వరద బాధితులకు సాయం చేసి అండగా నిలవాలని, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. గురువారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి, బాధితులను రెచ్చగొట్టడమే హరీశ్ రావుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా అత్యంత భారీ వర్షం నమోదైందని, అయినా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెంటనే స్పందించి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. వాతావరణం సహకరించకపోవడం వల్లే వరద ప్రాంతాల్లోకి హెలికాప్టర్లను పంపడం సాధ్యం కావడం లేదని చెప్పారు.
పదేండ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు ప్రతికూల పరిస్థితుల్లో హెలికాప్టర్లను ఉపయోగించడం వీలుపడదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లోకి హెలికాప్టర్లను పంపించడం లేదనే ఆరోపణలు చేయడం హరీశ్ రావు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శమని ఆరోపించారు.