పార్టీ కండువా వేసుకోవాల్సిందే

పార్టీ కండువా వేసుకోవాల్సిందే
  • అంగన్వాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిపై ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

జనగామ, వెలుగు: అంగన్వాడీ ఉద్యోగులు టీఆర్ఎస్​ పార్టీ కండువా కప్పుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వారిపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ ​అండ్​ హెల్పర్స్​ యూనియన్ ​జిల్లా మహాసభను జనగామ జిల్లా యశ్వంతాపూర్​ సమీపంలోని టీఆర్ఎస్​ జిల్లా ఆఫీస్ లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సభకు హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నల్లా భారతి మాట్లాడుతుండగా అడ్డు చెప్పారు. మెడలో పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పారు. తాము ఉద్యోగస్తులమని, పార్టీ కండువా వేసుకోవద్దని ఆమె ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ‘మీకు ఏ అసౌకర్యం కలిగినా మాదే బాధ్యత, మీరు మా పార్టీలో భాగం, మా కడుపుల ఇసం ఉండదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతం. మీరు తప్పకుండా పార్టీ కండువా కప్పుకోవాలే.. లేదంటే మేం మీటింగ్​నుంచి వెళ్లిపోతం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతి మరోసారి ఎమ్మెల్యేకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దాంతో టీఆర్ఎస్​ కేవీ అని ఉన్న పార్టీ అనుబంధ సంఘం కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే సంతృప్తి చెందలేదు. ‘అన్నా మేం ఉద్యోగస్తులం, పార్టీ కండువా వద్దు’.. అని మరోసారి నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే అయిష్టంగానే ప్రోగ్రాంలో పాల్గొన్నారు.