జనగామ/ హనుమకొండ సిటీ/ పర్వతగిరి, వెలుగు: తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం వారు బాధిత రైతులతో పాటు జనగామ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్, పార్టీ నాయకులు వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రం అందజేశారు.
అంతకుముందు ఎర్రబెల్లి పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో నీటమునిగిన పంటలను పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లో జరిగిన "విర్చుస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్–2025 లో రెండు స్వర్ణ పథకాలు సాధించిన పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన జీవాంజి దీప్తిని అభినందించారు. ఏనుగల్లు శివారు మల్యాతండాలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై మృతి చెందిన రైతులు హాల్యా, రాములు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్ దొమ్మటి లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతడిని పరామర్శించారు.
