- హైవేపై రైతులతో కలిసి రాస్తారోకో
బాల్కొండ, వెలుగు: కేసీఆర్ పాలనలో రారాజుగా ఉన్న రైతు.. రేవంత్ రాజ్యంలో రోడ్డున పడ్డాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా కొరత, యాప్ విధానంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల్పూర్‌లోని ఎక్స్ రోడ్ వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. రైతులను ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 4 సంచుల యూరియాను ఒకేసారి పంపిణీ చేయాలన్నారు. అన్ని సొసైటీలు, ప్రైవేట్ షాపుల్లో సరిపడా యూరియా నిల్వలు ఉంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్నారు.
ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రైతు బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 4 లక్షల యూరియా సంచులు పంపిణీ చేయడమేంటని కలెక్టర్ ప్రకటనపై వేముల ప్రశ్నించారు. 6 లక్షల ఎకరాలకు 24 లక్షల సంచులు అవసరమని, ఇంకా 20 లక్షల సంచుల కొరత ఉండగా స్టాక్ ఫుల్ అని చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ధర్నాతో ట్రాఫిక్ జామ్ కావడంతో వెహికల్స్‌ను దారిమళ్లించారు. అడిషనల్ కలెక్టర్, వ్యవసాయ శాఖాధికారి అక్కడికి చేరుకొని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
