దళితుల అభివృద్ధికి బీజేపీ కృషి

దళితుల అభివృద్ధికి బీజేపీ కృషి

హైదరాబాద్: ప్రజా క్షేత్రంలో కాకుండా ట్విట్టర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే కేటీఆర్... చివరికి ట్విట్టర్ పిట్టగా మిగిలిపోక తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘట్కేసర్ లో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ప్రచిక్షణ శిబిరంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోడీ జాతీయ జెండాను డీపీగా పెట్టకోవాలని దేశ ప్రజలను కోరడంలో ఏం తప్పుందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశభక్తి, సమైక్యతా భావాలను పెంపొందించేలా మోడీ దేశ ప్రజలను డీపీ మార్చుకోవాలని కోరారన్నారు. ప్రతి దానిని రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు.

ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలోని దళితులకు న్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ ఏర్పడిందే అంత్యోదయం కోసమన్న రఘునందన్... పేదలకు సేవ చేయడానికి బీజేపీ అహర్నిషలు కృషి చేస్తోందన్నారు. స్వచ్ఛభారత్ మొదలుకొని జన్ ధన్ యోజన, కిసాన్ యోజన వంటి అనేక పథకాలు పేదల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పడిన డిక్కీ సమావేశానికి స్వయంగా ప్రధాని మోడీ హాజరుకావడం దళితుల పట్ల తమ అంకిత భావానికి నిదర్శమన్నారు.