త్వరలో దుబ్బాకకు కేసీఆర్

త్వరలో దుబ్బాకకు కేసీఆర్

దుబ్బాక నియోజకవర్గంలో పూర్తైన కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గత కొంత కాలంగా నిర్మించిన వెంకటేశ్వర దేవాలయం, కేసీఆర్ స్కూల్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వంద పడకల ఆసుపత్రిని వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలు తనపై ఏ నమ్మకంతో అసెంబ్లీకి పంపించారో, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడడం జరిగిందన్నారు. దుబ్బాక పట్టణానికి రింగ్ రోడ్డు, హబ్సీపూర్ నుంచి దుబ్బాక వరకు ఫోర్ లైన్ రోడ్డు‌తో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

నియోజకవర్గంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరితే అప్పటికప్పుడు సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా కూడవెళ్లి వాగులోకి గోదావరి నీరు వదిలామని మంత్రి హరీష్ రావు ఇటీవల చెప్పారని, కానీ ఆ నీరు ఇంతవరకు దుబ్బాకకు రాకపోవడంపై ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజంగానే గోదావరి నీరు కూడవెళ్లి వాగులోకి వదిలినట్లైతే.. వాగులో వందల ట్రాక్టర్లు ఎలా ఉంటాయని రఘునందన్ ప్రశ్నించారు. వాగులోకి నీరు వస్తుందని చెప్పిన మంత్రి హరీష్ రావు.. ఇంకా ఎన్ని రోజులకు దుబ్బాకకు చేరుకుంటాయో చెప్పాలన్నారు. వాగులో నుంచి అక్రమంగా ఇసుకను ఎవరు తరలించమన్నారని.. అలా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని తనను విమర్శించడం సరికాదన్నారు. వారి విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ రహదారిపై తమ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు ప్రతిపాదనలు పంపింది నిజమే అని ఆయన అన్నారు. అయితే వాటిని ఇంకా ఎందుకు మంజూరు చేయడంలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడిగామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రహదారి కోసం మీరు ప్రతిపాదనలు పంపితే.. వాటిని త్వరగా మంజూరు చేయాలని ఒక ఎమ్మెల్యేగా తను కోరితేనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని రఘునందన్ స్పష్టం చేశారు.