ప్రతి దళిత కుటుంబానికి  రూ.10 లక్షలు చేరాలి

ప్రతి దళిత కుటుంబానికి  రూ.10 లక్షలు చేరాలి
  • దళితబంధుకు సహకరిస్తం: ఎమ్మెల్యే రఘునందన్​రావు
  • ఎస్సీ కార్పొరేషన్‌‌ రుణాలు ఉంటయా? ఉండవా? అని ప్రశ్న

హైదరాబాద్‌‌, వెలుగు: దళితబంధుపై ప్రభుత్వం సరైన టైమ్‌‌ టేబుల్‌‌ ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌‌రావు కోరారు. పథకానికి సహకరిస్తామని.. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు చేరాలని ఆకాంక్షించారు. మంగళవారం దళితబంధు షార్ట్‌‌ డిస్కషన్‌‌ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధు అమలుకు ప్రభుత్వానికి నిధుల కొరత ఉంటే అఖిల పక్షం తీసుకుని కేంద్రం వద్దకు పోదామని.. ఢిల్లీకి రావడానికి, పథకానికి డబ్బులు అడగడానికి, కేంద్రాన్ని ఒప్పించడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు. ట్రైబల్స్‌‌, బీసీ, ఓసీలో పేద వర్గాలకు ఈ పథకాన్ని విస్తరించారా అని ప్రశ్నించారు. వ్యాపారానికే రూ.10 లక్షల నిధులు అందిస్తారా లేక ఎకరమో అరెకరమో వ్యవసాయ భూమి కొనుగోలుకు, సంపద సృష్టించే హార్టికల్చర్‌‌ రంగాలకు, కూరగాయాల సాగుకు అవకాశం కల్పిస్తారా అని సందేహం వ్యక్తం చేశారు. 2017–18  నుంచి దళితులకు ఎస్సీ కార్పొరేషన్‌‌ ఇచ్చే రుణాలు నిలిపివేశారన్నారు. దళిత బంధు అమలు చేస్తే భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఇచ్చే రుణాలు ఉంటాయా ఉండవా అని ప్రశ్నించారు. 85 శాతం ఉన్న వర్గాలకు కేబినెట్‌‌లో సమాన అవకాశాలు కల్పిస్తారా అని అడిగారు. దళిత సమాజం వర్గీకరణ కోసం పోరాడుతోందని, దీనిపై గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారని, మళ్లీ కేంద్రాన్ని కలిసే అవకాశం ఉందా అని ప్రశ్నించారు.