బీజేపీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన రాజాసింగ్

బీజేపీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన రాజాసింగ్

బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని పేర్కొంటూ క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తానెక్కడ కూడా పార్టీ నిబంధనలను ఉల్లంఘించలేదని.. ఏ మతాన్ని కించపర్చలేదన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని, దాన్ని కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. మునావర్ ఫారుఖీని ఇమిటేట్ మాత్రమే చేశానని.. ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. 

టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని.. తనపై వందకుపైగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 500 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలిపారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని.. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ డిసిప్లినరీ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.