మెదక్ టౌన్, వెలుగు: ఆరు నెలల్లో మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్స్‌లో రూ.90 లక్షల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రాంగా మారిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని, ఏడుపాయలకు రూ.30 కోట్లు, మెదక్ చర్చికి రూ. 33 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రూ. 5 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెప్మా పీడీ హన్మంత రెడ్డి, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ సునీత పాల్గొన్నారు.
