- ఐఎఫ్ఎస్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఐపీఎస్ అధికారి గౌస్ ఆలమ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్‌కుమార్, సెక్రటరీ ప్రియాంక వర్గీస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో వ్యక్తిగతంగా, మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ కౌశిక్‌రెడ్డి అనుచితంగా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇవి రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. గౌస్ ఆలమ్ కు అసోసియేషన్ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
