కంటోన్మెంట్ విలీనమే ధ్యేయం : ఎమ్మెల్యే శ్రీగణేశ్

కంటోన్మెంట్ విలీనమే ధ్యేయం : ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • అప్పటిదాకా మా పోరాటం ఆగదు 
  • రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్  

పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసేవరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే శ్రీగణేశ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయకుండా, 2020 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. కేంద్రం నిరంకుశ వైఖరికి నిరసనగా మంగళవారం కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు.

 సర్వమత ప్రార్థనల అనంతరం దీక్షాస్థలిలో నాయకులు, మేధావులు, కంటోన్మెంట్ శ్రేయోభిలాషులతో కలిసి దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్‌లో విలీనం కావడమే ఏకైక మార్గమన్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు కారణంగా ప్రాంతం మూడు దశాబ్దాలుగా వెనుకబడిందని ఆరోపించారు. నిధులు లేని బోర్డు వల్ల తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా అందడం లేదని తెలిపారు. విలీనం చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, మేధావులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.