కంటోన్మెంట్ బోర్డుకు రూ.1,200 కోట్ల ఆర్మీ సర్వీస్ చార్జీలు చెల్లించాలి : ఎమ్మెల్యే శ్రీ గణేశ్

కంటోన్మెంట్ బోర్డుకు రూ.1,200 కోట్ల ఆర్మీ సర్వీస్ చార్జీలు చెల్లించాలి : ఎమ్మెల్యే శ్రీ గణేశ్
  •     ఎమ్మెల్యే శ్రీగణేశ్​ డిమాండ్​

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.1,200 కోట్ల ఆర్మీ సర్వీస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్, ఆర్మీ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ నిధులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కంటోన్మెంట్ పరిధిలో జరిగే ట్రాన్స్​ఫర్ రిజిస్ట్రేషన్ చార్జీలు నేరుగా బోర్డు ఖాతాలో జమ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుండటం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఇకపై రిజిస్ట్రేషన్ ఆదాయం నేరుగా బోర్డు ఖాతాకే వచ్చేలా ప్రత్యేక తీర్మానం చేశారు.

జేబీఎస్ చిరు వ్యాపారులకు భరోసా

జేబీఎస్ పరిసరాల్లో దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ భరోసా ఇచ్చారు. పాత దుకాణాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేసి, కొత్త కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో సోమవారం కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. కొత్త భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అదే స్థలంలో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా బోర్డు సీఈవోతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేస్తానన్నారు.