
- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
బోధన్,వెలుగు: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాలూరలోని టీటీడీ కల్యాణ మండపంలో 108 మందికి, బోధన్ లో లయన్స్ ఆసుపత్రి మీటింగ్ హాల్ లో 665 కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని, ఐకేపీ, మెప్మా ద్వారా రూ.లక్ష రుణం ఇస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 22 కోట్ల నిధులు వెచ్చించిందన్నారు.
రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 11,852 కొత్త రేషన్ కార్డులతో పాటు 84,232 మంది కొత్త సభ్యులను కార్డుల్లో చేర్చినట్టు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. లీకేజీలు, ఫ్లోరింగ్ రిపేర్లు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండల కేంద్రంలో..
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ 728 మందికి రేషన్‌కార్డులు అందజేశారు. 2118 మందిని కార్డులలో చేర్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు రఫియొద్దీన్, జొన్నల రాజు, అబ్దుల్‌వాహబ్, ప్రసాద్‌గౌడ్, నగేశ్ సుప్పాల రాజు తదితరులు పాల్గొన్నారు.