
బోధన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని, అధికారులు, సిబ్బంది సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని మధుమలంచ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ సర్కార్వనమహోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
రేవంత్ సర్కార్ పేదల పెన్నిధి అని, కొత్త రేషన్ కార్డులు అందించడంతోపాటు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్నారు. అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ‘భూభారతి’లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరంమున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, సివిల్ సప్లై డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించాలి
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు : నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలూర్ మండలంలోని దేగాం గ్రామంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గౌడ సంఘం ఆవరణలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి మాట్లాడారు. చెరువు కట్టలపై, పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈత, తాటి, పండ్ల మొక్కలు నాటాలన్నారు. అనంతరం గంగమ్మ ఆలయ నిర్మాణానికి రూ.10లక్షల ప్రొసీడింగ్ కాపీని గంగపుత్ర సంఘం సభ్యులకు అందజేశారు. ఎంపీడీవో గంగాధర్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు యాదగిరి, బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పెంటన్న పాల్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలో..
నిజామాబాద్, వెలుగు: వనమహోత్సవంలో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. బుధవారం ఇందల్వాయి మండల కేంద్రంలో ఫారెస్ట్ డిపార్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ భోగ నిఖిత, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ సుధాకర్‌రావు పాల్గొన్నారు.