యుద్ధమే వస్తే నేనూ తుపాకీ పడుతా : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

యుద్ధమే వస్తే నేనూ తుపాకీ పడుతా : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: యుద్ధం ఎప్పుడొచ్చినా ఢీకొట్టడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా యువత ముందు వరుసలో నిలబడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. శనివారం ఉ ట్నూర్ మండల కేంద్రంలో  వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రమూకలతో వీరోచితంగా పోరాడి, అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ ఫొటో వద్ద నివాళి అర్పించారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ.. యుద్ధమే వస్తే తాను సైతం తుపాకీ పట్టి పోరాడుతానన్నారు. మురళీ నాయక్ ను అందరూ స్ఫూర్తిగా తీసుకొని, దేశ రక్షణకు పాటుపడాలని సూచించారు. మాజీ జవాన్లు డాకురే శత్రుఘన్, నరోటె వినాయక్ ను సత్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వెడ్మ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల ర్యాలీ

మంచిర్యాల, వెలుగు: ఆపరేషన్​సిందూర్​లో పాల్గొంటున్న భారత సైనికులకు మద్దతుగా కాంగ్రెస్​ నాయకులు మంచిర్యాలలో శనివారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి, అమర జవాన్లకు నివాళి అర్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, డీసీసీ చైర్ పర్సన్ సురేఖ, నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి చౌరస్తాలో కళాకారులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సైన్యానికి మద్దతు తెలిపారు.