ఉట్నూర్, వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ జొజ్జు పటేల్ గురువారం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఫోన్ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే’ పేరుతో స్వయంగా ఎమ్మెల్యేనే నియోజకవర్గ ప్రజలతో ఫోన్లో మాట్లాడారు. దీంతో మొదటిరోజు కడెం, ఖానాపూర్, జన్నారం, దస్తూరాబాద్, ఇంద్రవెల్లి, ఉట్నూర్మండలాలకు చెందిన పలువురు ఫోన్ చేసి తమ సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు.
నీటి ఎద్దడి, మురుగు నీటి కాల్వల సమస్య, విద్యత్ సరఫరాలో అంతరాయాలు, మిషన్ భగీరథ, జీవో నంబర్3, ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం గత ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో, అటవీ హక్కుల చట్టంలో భూ సమస్యలు, పట్టాలు అందకపోవడం తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను నోట్ చేసుకున్న బొజ్జు పటేల్ విడతల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.