- నకిరేకల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
చిట్యాల, వెలుగు: ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం గుండ్రంపల్లి, పెదకాపర్తి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు అత్యంత వేడుకగా జరిగాయి. నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి ఆయన లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లావ్యాప్తంగా 6,409 ఇండ్ల గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ఇల్లు అనేది పేదల గౌరవమని, తొలి విడతలో మంజూరైన ఇండ్లను వేగంగా పూర్తి చేసి ప్రతీ కుటుంబానికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సాహిత్యం సమాజానికి మార్గదర్శకం.
నకిరేకల్ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పన్నాలగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులను సన్మానించారు. సాహిత్యం సమాజానికి మార్గదర్శకమని, కవులు తమ కలం ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యతను, చైతన్యాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
