కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది :   ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే..  సీఎం రేవంత్ బ్యాంకర్లతో మాట్లాడి  అప్పులు తీర్చడానికి కష్టపడుతున్నారని చెప్పారు.  కాళేశ్వరం పాజెక్టుతో కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు వృధా చేశారని, బ్యాక్ వాటర్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.  త్వరలోనే సమస్య పరిష్కారానికి మంచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.  కోటపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో 69 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్.  

మిషన్ భగీరథ ఒక ఫెయిల్ ప్రాజెక్టు అని విమర్శించారు వివేక్  వెంకటస్వామి. ఎక్కడ కూడా నీరు సరఫరా అవడం లేదన్నారు.   కేవలం కమీషన్లు దోచుకోవడానికే ఈ స్కీమ్ పెట్టారని  ఆరోపించారు.  చెన్నూర్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కారానికి 100 బోర్లు వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని చెప్పారు.  

ఆగస్టు 15 లోగా రైతులకు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్  హామీ ఇచ్చారని అన్నారు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  రుణమాఫీ తర్వాత అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.  నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రజల సమస్యలను అన్నింటినీ పరిష్కరం చేసి చూపిస్తామని తెలిపారు.