సమ్మక్క, సారలమ్మ దీవెనలు ప్రజలపై ఉంటాయి : వివేక్​ వెంకటస్వామి

సమ్మక్క, సారలమ్మ దీవెనలు ప్రజలపై ఉంటాయి : వివేక్​ వెంకటస్వామి
  • ఆర్టీసీ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలె

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: ప్రజలకు మంచి చేసేందుకు సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ​సర్కార్​ ప్రజాపాలన అందిస్తోందని   చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సోమవారం మందమర్రి బస్టాండ్​లో ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారం జాతర స్పెషల్​ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.

మందమర్రి నుంచి గత జాతర టైమ్​లో కేవలం 30 బస్సులు నడిపారని, భక్తుల సౌకర్యార్థం ఈసారి 55 బస్సులు నడుపుతు న్నట్లు చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేయడంతో ఈసారి మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని అన్నారు. మందమర్రి తహసీల్దార్​ చంద్రశే ఖర్, మున్సిపల్ ​కమిషనర్​ వెంకటేశ్వర్లు, క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​సాగర్​రెడ్డి, ఆర్టీసీ రీజియన్ ​మేనేజర్​ సోలమన్, మంచిర్యాల, నిర్మల్​డిపో మేనేజర్లు రవీంద్రనాథ్, ప్రతిమారెడ్డి పాల్గొన్నారు. 

జాతర ఏర్పాట్ల పరిశీలన

మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున ఈనెల 21 నుంచి నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతర కోసం చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగరేణి అధికారులు, పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం చెన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కనకదుర్గ పెట్రోల్​బంకును ప్రారంభించారు.

భీమారంలో డుబ్బుల కొలుపు కళాకారులు సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చెన్నూరు మండలం నర్సక్కపేట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త నగరం బొందయ్య సతీమణి మౌనిక, చెన్నూరు సబ్​స్టేషన్​ఆవరణలో నివాసముండే ఆర్ఎంపీ అంబాల రాజేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు.