- మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే తెరవాలని ఎమ్మెల్యే ఆదేశాలు
- సంస్థాన్ నారాయణపురంలో ఉదయమే ఓపెన్ చేసిన ఓనర్లు
- బలవంతంగా మూయించిన ఎమ్మెల్యే అనుచరులు
- దగ్గరుండి ఓపెన్ చేయించిన ఆబ్కారీ ఆఫీసర్లు
యాదాద్రి/సంస్థాన్‌నారాయణపురం, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ ఓపెన్ చేసే టైం విషయంలో ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ మధ్య గొడవ మొదలైంది. వైన్స్‌ను మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే తెరవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓనర్లను ఆదేశించగా.. అదేం కుదరదంటూ ఎక్సైజ్ ఆఫీసర్లు దగ్గరుండి మరీ వైన్స్‌ను ఓపెన్ చేయించడం వివాదంగా మారింది.
టెండర్ల టైంలోనే ఎమ్మెల్యే ఆదేశాలు
మునుగోడు నియోజకవర్గంలో వైన్స్‌ను మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత, పర్మిట్ రూమ్స్‌ను సాయంత్రం ఆరు గంటల తర్వాతే తెరవాలని టెండర్ల టైంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపులను దక్కించుకున్న ఓనర్లు కొన్ని రోజులుగా ఎమ్మెల్యే చెప్పిన టైం ప్రకారమే షాపులను ఓపెన్ చేస్తుండగా.. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లోని వైన్స్ ఓనర్లు మాత్రం ఉదయం 10.30 గంటలకే షాపులను తెరుస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు గురువారం సంస్థాన్ నారాయపురంలోని వైన్స్ వద్దకు వెళ్లి నిర్వాహకులతో గొడవకు దిగి, షాపులను మూసివేయించారు. దీంతో వైన్స్ ఓనర్లు రామన్నపేట సర్కిల్ ఎక్సైజ్ ఆఫీసర్లను కలిసి.. ఎమ్మెల్యే ఆదేశాల కారణంగా తాము నష్టపోవాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. మునుగోడు నియోజకర్గంలో వైన్స్ నిర్వహణలో జరుగుతున్న పరిణామాలను ఉన్నతాధికారులకు వివరించడంతో రూల్స్ ప్రకారం వైన్స్ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అడ్డుకుంటే చర్యలు
రూల్స్ ప్రకారం ఉదయం 10.30 తర్వాత వైన్స్‌లు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన షాపులను ఎవరైనా మూసివేయిస్తే చర్యలు తీసుకుంటాం.
- బాలాజీనాయక్, ఎక్సైజ్ సీఐ, రామన్నపేట-
రంగంలోకి ఎక్సైజ్ ఆఫీసర్లు
ఉన్నతాధికారుల ఆదేశాలతో రామన్నపేట ఎక్సైజ్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయమే సంస్థాన్ నారాయణపురం చేరుకొని రెండు వైన్స్‌ను దగ్గరుండి ఓపెన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు వైన్స్ వద్దకు వచ్చి షాపులు మూసివేయాలని సూచించగా.. ఎక్సైజ్ ఆఫీసర్లు ఒప్పుకోకపోగా రూల్స్ ప్రకారం షాపులు నడుస్తాయని స్పష్టం చేశారు.
మధ్యాహ్నం తర్వాత షాపులు తీయాలని టెండర్లకు ముందే ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని గుర్తుచేసి, వెంటనే మూసివేయాలని మరోసారి హెచ్చరించినప్పటికీ ఓనర్లు మాత్రం ఎక్సైజ్ పోలీసుల బందోబస్తు నడుమ అమ్మకాలు కొనసాగించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, ఎక్సైజ్ ఆఫీసర్ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
ఆలోగా మధ్యాహ్నం కావడంతో ఎమ్మెల్యే అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శనివారం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్, సాయంత్రం ఆరు గంటల తర్వాతే పర్మిట్ రూమ్స్ ఓపెన్ చేయాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ఇచ్చిన సూచనలు ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు.
