‘పాలమూరు’కు కేసీఆర్ ద్రోహం చేసిండు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

‘పాలమూరు’కు కేసీఆర్ ద్రోహం చేసిండు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  •     రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాను సీఎం అయ్యాక కేసీఆర్ పట్టించుకోలేదు
  •     కల్వకుంట్ల కుటుంబం మొత్తం పాలమూరు ద్రోహులే
  •     ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు :  పాలమూరు జిల్లాకు కేసీఆర్​ద్రోహం చేసిండని, రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాను సీఎం అయ్యాక కేసీఆర్ పట్టించుకోలేదని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం వలసలకు చిరునామా అని, పేదరికం, నిరుద్యోగం, విద్యలో వెనుకబాటుతనం ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయని, 'పాలమూరు' పేరును పదే పదే వందల సార్లు ప్రస్తావించి.. చివరకు ఆ పేరును ముంచేశారని మండిపడ్డారు. ఇది నిర్లక్ష్యం కాదని, కేసీఆర్​పూర్తిగా తెలిసే చేసిన ద్రోహమని ఫైర్​ అయ్యారు. మంగళవారం మహబూబ్​నగర్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 

ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తానని మాయమాటలు చెప్పి, ఈ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించింది ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ ​నాయకులను ప్రశ్నించారు. కృష్ణా జలాలను జగన్ మోహన్ రెడ్డికి కట్టబెట్టిన అంశాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు ఒక్కరైనా ముందుకు రాలేదన్నారు. జూరాల దగ్గర ఉన్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు శ్రీశైలానికి తీసుకుపోయారని బీఆర్ఎస్ జిల్లా​నేతలు ఒక్కరైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. ఇది అంతర్రాష్ర్ట ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుందని, జల వివాదాలకు దారితీస్తుందని, పర్యావరణ అనుమతులు రావని ఎప్పుడైనా కేసీఆర్​తో మాట్లాడారా? అని ప్రశ్నించారు. 

అప్పటి ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్​ఎస్​ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. పదవుల కోసం పాలమూరుకు ద్రోహం చేస్తున్నా మౌనంగా ఉండిపోయారన్నారు. జూరాల నీటిని ఒడిసి పట్టుకునే చిత్తశుద్ధి అప్పుడే ఉండుంటే.. ఇప్పటి వరకు పాలమూరు సస్యశ్యామలం అయ్యేదన్నారు. కనీసంగా 70 టీఎంసీల నీరు రైతాంగానికి దక్కేవన్నారు. 

మహబూబ్‌‌‌‌నగర్ ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌‌‌‌లను మాత్రమే కాదు, మొత్తం కల్వకుంట్ల కుటుంబాన్ని పాలమూరు ద్రోహులుగానే చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్కొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, నాయకులు పాల్గొన్నారు.