- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి యువత కేవలం ఓటు హక్కుకే పరిమితం కాకుండా బాధ్యతాయుత భాగస్వామ్యంతో ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో, భారత్‌లో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యూనివర్సిటీ లైబ్రరీ హాల్‌లో బుధవారం నిర్వహించిన ‘వికసిత భారత్ యూత్ పార్లమెంట్-2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, మహబూబ్ నగర్ జిల్లాలో 10 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యార్థులు అకాడమిక్స్‌తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, ఏఐ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో చట్టసభల పనితీరు, చర్చా విధానాలపై అవగాహన పెంచడమే ఈ యూత్ పార్లమెంట్ ఉద్దేశమని తెలిపారు. అనంతరం ‘భారత అత్యవసర పరిస్థితి - ప్రజాస్వామ్య పాఠాలు’ అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
హన్వాడ : మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ, కొత్తపేట గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులతో కలిసి ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేసిందని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుద్ధరాం సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షుడు మహేందర్, సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు భరోసాగా ప్రజా ప్రభుత్వం
మహబూబ్ నగర్ అర్బన్ : ఆడబిడ్డలకు భరోసాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో బుధవారం మధ్యాహ్నం రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
