
65 మంది ఎమ్మెల్యేలు, 15 మంది మంత్రులకు టెన్షన్
ఓడితే చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరికలు..
చాలా చోట్ల రెబల్స్ బరిలో ఉండటంతో టెన్షన్
హైదరాబాద్, వెలుగు: గులాబీ లీడర్లకు మున్సిపోల్స్ టెన్షన్ పట్టుకుంది. ఒక్క సీటు ఓడినా చర్యలు ఉంటాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎలక్షన్లు పరీక్షగా మారాయి. 80 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 65 మంది ఎమ్మెల్యేలు,15 మంది మంత్రులపై దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 120 మున్సిపాల్టీలు,9 కార్పొరేషన్లకు, శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ కు పోలింగ్ జరుగనుంది. ఇందులో మంథని, మధిర, సంగారెడ్డి, సదాశివపేట, చండూరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నాయి. మిగతా 115 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీలను దక్కించుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్నిరకాలుగా కూడా ప్రయత్నించారు. కానీ చాలా చోట్ల అసంతృప్తులు, రెబెల్స్ రంగంలోకి దిగడంతో రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. ప్రతిపక్షాల క్యాండిడేట్లు గెలిచినా, రెబల్స్ గెలిచినా పార్టీలో ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని ఓ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు.
మంత్రుల సెగ్మెంట్లలో..
మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇద్దరి సెగ్మెంట్ల పరిధిలోనే 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారంటూ సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. టికెట్ రాని వారు రెబల్స్ గా బరిలో ఉన్నారు. ఇక మంత్రికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెబల్స్ కు సపోర్టు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన అనుచరులను రెబల్స్‌గా పోటీ చేయిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్గంలో సందేహాలున్నాయని చెప్తున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ లు తమ సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో రెబల్స్ వెనుక కొందరు పార్టీ సీనియర్ లీడర్ల ప్రోత్సాహం ఉందని అనుమానిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో రెబల్స్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారని మంత్రి నిరంజన్ రెడ్డిపై పార్టీ వర్గాలు అంటున్నాయి. సొంత మున్సిపాల్టీలపై మాత్రమే ఆయన దృష్టి పెట్టారని, మిగతా విషయాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మహబూబ్‌నగర్‌లో గెలిచే అభ్యర్థులను కాదని స్థానికంగా పట్టులేనివారికి టికెట్ ఇచ్చారని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెబల్స్ ను బుజ్జగించడంలో మంత్రి ఎర్రబెల్లి విఫలమయ్యారని చెప్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో రెబల్స్ దారిలోకి రాకపోవడంతో మంత్రి జగదీశ్ రెడ్డి కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కూడా.
ముగ్గురు మంత్రులకు బీజేపీ సెగ
బీజేపీ ఎంపీలున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ముగ్గురు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లకు సవాల్‌గా మారింది. ఆయా చోట్ల బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. విస్తృతంగా ప్రచారం చేసింది. దీనికితోడు రెబల్స్కూడా బరిలో ఉండటంతో టీఆర్ఎస్ లీడర్లలో గుబులు కనిపిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ సెగ్మెంట్ పరిధిలో మున్సిపల్ ఎలక్షన్లు లేవు. ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ లీడర్లు దీటుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇక జీహెచ్ఎంసీలో ఎలక్షన్లు లేకపోవడంతో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ లకు మున్సిపల్ ఎలక్షన్ల టెన్షన్ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.