దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..

దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..
  • ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు: కేసీఆర్
  • అర్హులను గుర్తించే బాధ్యత ఎమ్మెల్యేలదే
  • స్కీం కోసం వచ్చే బడ్జెట్​లో రూ. 30 వేల కోట్లు కేటాయిస్తం
  • బీజేపీని ఎండగట్టి.. బొందపెట్టకపోతే మనం బోనులో నిలబడాల్సి వస్తది
  • ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా 20న ఊరూరా చావు డప్పు
  • డీఎంకే తరహాలో తరతరాలు నిలబడేలా టీఆర్​ఎస్​ను తయారుచేస్తం
  • టీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ చీఫ్​
  • వడ్ల కొనుగోళ్లపై నేడు ఢిల్లీకి మంత్రులు, ఎంపీలు

హైదరాబాద్​, వెలుగు: దళిత బంధు పథకం హుజూరాబాద్‌‌ కోసం తెచ్చింది కానే కాదని, హుజూరాబాద్‌‌తో పాటు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో వంద శాతం ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఒక్కో సెగ్మెంట్​లో వంద మందికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే దళిత బంధు వర్తింపజేస్తామని, అర్హులను గుర్తించే అధికారం ఎమ్మెల్యేలకే అప్పగిస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన టీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మూడు గంటల పాటు మాట్లాడారు. ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు, కీలక నేతల నుంచి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఫీడ్‌‌ బ్యాక్‌‌ తీసుకున్నారు. వరి వేసే వారికి రైతుబంధు ఇవ్వరనే వార్తలపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేసీఆర్​ స్పందిస్తూ.. వ్యవసాయ శాఖ తరఫున తనకు ఆ ప్రతిపాదన వచ్చిన మాట నిజమేనని, తాను బతికున్నంత వరకు రైతుబంధు ఆగేది లేదని, ఎప్పటిలెక్కనే ఇస్తామన్నారు.

వచ్చే బడ్జెట్‌లో దళిత బంధు స్కీంకు రూ.20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు కేటాయిస్తామని, దశలవారీగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపజేసి తీరుతామని చెప్పారు. దళితబంధుపై సోషల్‌ మీడియా కేంద్రంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్​ఎస్​ నేతలకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న ఊరూరా చావు డప్పు కొట్టాలని చెప్పారు. గ్రామాల్లో ఊరేగింపు తీయాలని, ఇతర రూపాల్లోనూ నిరసన తెలుపాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాలతోనే  జిల్లాల టూర్​ను తాను వాయిదా వేసుకుంటున్నట్లు చెప్పారు. మళ్లీ ఎప్పుడు చేపట్టేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఈ నెల 23న వనపర్తి, 24న జనగామ టూర్‌ ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. 

డీఎంకే  తరహాలో టీఆర్‌ఎస్‌

తమిళనాడులో డీఎంకే నాలుగు తరాలుగా అక్కడి ప్రజల మన్ననలు చూరగొందని కేసీఆర్​ చెప్పారు.  డీఎంకే, అన్నాడీఎంకే తప్ప ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు చోటే లేదని, ఇందుకు ఆ రెండు పార్టీల సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల కమిట్‌మెంటే కారణమన్నారు. డీఎంకే తరహాలోనే తరతరాలు నిలబడేలా టీఆర్ఎస్‌ పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేంద్రంలో థర్డ్​ ఫ్రంట్​,  ప్రాంతీయ పార్టీల ఐక్యతపై ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌తో జరిగిన చర్చల్లో మాట్లాడానని కేసీఆర్​ తెలిపారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలతో పాటు అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. 

కష్టపడేవాళ్లకు పదవులు వస్తయ్‌

పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు 60 లక్షల కుటుంబ సభ్యులను సమకూర్చుకుందని కేసీఆర్​ అన్నారు. నాయకుల సంఖ్య భారీగా పెరిగిందని, నేతలకు ఓపిక అవసరమని చెప్పారు.  ఎంసీ కోటిరెడ్డికి చెప్తే ఓపిక పట్టి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. నామినేటెడ్‌ పదవులన్నీ భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు తప్పకుండా వస్తాయన్నారు. వారం రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తానని చెప్పారు. జిల్లా కమిటీలపైనా క్లారిటీ ఇస్తానని, జిల్లాకు అధ్యక్షుడు ఉండాలా.. కన్వీనర్‌ను నియమించాలా అనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్ల సేవలు ఉపయోగించుకుంటామని తెలిపారు. 

కాశీలో ప్రధాని అట్ల మాట్లాడుతరా?

దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ కాశీ పుణ్యక్షేత్రంలో ఒక మతంపై ప్రజల్లో విద్వేషం కలిగించేలా మాట్లాడుతారా అని కేసీఆర్​ మండిపడ్డారు. కాశీ అభివృద్ధికి ఏం చేశారో, ఎన్ని నిధులిచ్చారో చెప్పుకోవాలి కానీ ప్రజల్లో విభజన తెచ్చేలా మాట్లాడుతారా అని అన్నారు. వరికి బదులు ఏ పంటలు వేయాలనే విషయమై వ్యవసాయ అధికారులతో కలిసి రైతు వేదికలను కేంద్రంగా చేసుకొని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రం చేసిన మోసాలను  రైతు వేదికల్లో  తెలియజెప్పాలన్నారు. కేంద్ర రైతు విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌లు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం ప్రతినిధులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి హరీశ్‌రావు సమావేశానికి హాజరుకాలేదు.

వానాకాలం వడ్ల కొనుగోళ్లపై కేంద్రం వద్దకు

వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంత్రులు, ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లాలని సీఎం కేసీఆర్​  ఆదేశించారు. ఇదే విషయాన్ని సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఎంపీలు, తనతో పాటు మంత్రులు గంగుల కమలాకర్‌, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కూడిన ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీకి వెళ్తుందని ఆయన చెప్పారు. ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోరామన్నారు. కేంద్రం ఇచ్చిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్‌ ముగిసిందని,  ఇంకా 30 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉందని, అది మొత్తం కొనాలని డిమాండ్‌ చేస్తామని చెప్పారు. కేంద్రం ఒప్పుకోకపోతే తర్వాతి యాక్షన్​ప్లాన్​  ప్రకటిస్తామన్నారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ధాన్యం సేకరణపై బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో  పిచ్చి ప్రేలాపనలు పేలారని ఆయన దుయ్యబట్టారు. యాసంగిలో వరి వేస్తే ప్రభుత్వం కొనబోదని మరోసారి తేల్చిచెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ థర్డ్‌ క్లాస్‌ రాజకీయం చేయబోయిందని, అది ప్రజలకు అర్థమైందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నాయనుకొని పనిచేయాలె

ఎలక్షన్లకు ఇంకో రెండేండ్లు, మూడేండ్లు ఉన్నాయనుకొని నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఇప్పుడే ఉన్నాయనుకొనే పనిచేయాలని టీఆర్​ఎస్​ లీడర్లకు పార్టీ చీఫ్​ కేసీఆర్‌‌  సూచించారు. ఎమ్మెల్యేలెవరూ హైదరాబాద్‌‌లో ఉండొద్దని, పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటే వారిని గెలిపించే బాధ్యత తనదేనని, ప్రజల్లో ఉండని ఎమ్మెల్యేలను తాను కూడా గెలిపించలేనని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలతో పాటు బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడాలని తాను గతంలోనే చెప్పానని, కొందరు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని,  దూకుడుగా ఉండాలని ఆదేశించారు. ఇంత చెప్పినా తీరు మార్చుకోని ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చేస్తామని కేసీఆర్​ హెచ్చరించారు.

బీజేపీని రాక్షసుల్లా వెంటాడాలి
ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా చురుగ్గా ఉండాలని, బీజేపీని రాక్షసుల్లా వేటాడాలని కేసీఆర్​ పిలుపునిచ్చినట్లు సమాచారం. ‘‘బీజేపీని ఎండగట్టి.. బొందపెట్టకపోతే ప్రజల ముందు మనం దోషులుగా నిలబడాల్సి వస్తుంది” అని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. బీజేపీకి సోషల్‌ మీడియా బలం ఎక్కువగా ఉందని, టీఆర్​ఎస్​  వీక్‌గా ఉందని, సోషల్‌ మీడియా స్ట్రెంతెన్‌ చేయాల్సి అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు కూడా సోషల్‌ మీడియా వింగ్‌లు ఏర్పాటు చేసుకొని కేంద్రం, బీజేపీపై ఎదురుదాడి చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలంటే లెక్కలేదని, బీజేపీ ప్రజల్లో విభజన సృష్టించి ఎన్నికల్లో గట్టెక్కడానికి ఎన్ని కుట్రలకైనా తెగిస్తుందని అన్నారు. కేంద్రం నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్​ చెప్పారు. కేంద్రం తీరుపై దూకుడుగా పోరాడాలని పార్టీ నేతలకు  పిలుపునిచ్చారు.