ఎన్నికల ఏడాది ఫండ్స్​ ఇయ్యండి

ఎన్నికల ఏడాది ఫండ్స్​ ఇయ్యండి
  • నియోజకవర్గ నిధుల కోసం సీఎంవోకు ఎమ్మెల్యేల వినతులు 
  • ఊర్లలో ప్రజల నుంచి వ్యతిరేకత, నిలదీతలు
  • నిధుల కోసం సర్పంచ్​ల లెక్క తిరగాల్సిన పరిస్థితి
  • నిరుడు కేటాయించిన రూ.5 కోట్లలో సగమైనా ఇయ్యలె
  • సీఎం స్పెషల్ ఫండ్ 10 వేల కోట్లలో ఎంతిస్తరో తెలియని పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ) కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్ ఇయర్ కావడంతో ఇప్పుడైనా ఇవ్వాలని సీఎంవోకు, ఆర్థిక శాఖకు విన్నవించుకుంటున్నారు. ఆ నిధులతో గ్రామాల్లో కొన్ని డెవలప్​మెంట్ పనులకు ఓపెనింగ్​లు చేస్తే.. ఉన్న వ్యతిరేకత కొంతైనా తగ్గుతుందని మొత్తుకుంటున్నరు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఎమ్మెల్యేల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్లో కూడా సీడీపీ ఫండ్స్ గురించే ఎక్కువ ఉంటున్నాయి. సర్పంచ్​ల లెక్క తాము తిరగాల్సి వస్తున్నదని ఇటీవల ఒక మంత్రి దగ్గర ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వాపోయినట్లు తెలిసింది. 2022–23లో రూ.800 కోట్లు కేటాయించగా.. ఆ నిధుల్లో ఇప్పటి వరకు ఇచ్చిన ఫండ్స్ సగం కంటే తక్కువే ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మరికొన్నింటికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఇస్తున్నప్పటికీ.. ఫైనాన్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ కావడంలేదు. చాలా పనులు శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పైగా ఒక్కో ఎమ్మెల్యే రూ.5 కోట్లలో.. మన ఊరు–మనబడి కోసమే రూ.2 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేక.. ఇటు మన ఊరు–మన బడి కింద సర్కారు స్కూళ్లు బాగు చేసుకోలేకపోవడంతో గ్రామాల్లో ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

సీఎంవో, మంత్రులను వేడుకుంటున్నరు

ఇప్పటికే నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉండడం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిధుల కోసం ఎమ్మెల్యేలు సీఎంవో, ఆర్థికశాఖ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులకు చెప్పుకుంటూ తమ నియోజకవర్గానికి ఫండ్స్ ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు. కనీసం తమ సీడీపీ నిధులనైనా పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు సహకరించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు ఈసారి బడ్జెట్​లో సీఎం స్పెషల్ ఫండ్ కింద రూ.10 వేల కోట్లు పెట్టుకున్నారు. అందులో నుంచి కూడా తమకు పెద్ద మొత్తంలో ఫండ్స్​ వచ్చేలా సీఎంవో అధికారులకు రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకుంటున్నట్లు తెలుస్తున్నది. కొన్ని పనులైనా చేయకపోతే ఇబ్బందికరంగా మారుతుందని.. విన్నవించుకుంటున్నరు.

గ్రామాల్లో నిలదీతలు

ఎన్నికల ఏడాది కావడంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. 2018 ఎలక్షన్స్ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇచ్చిన హామీలను జనాలు లేవనెత్తుతున్నారు. కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, లైబ్రరీలు, దోబి ఘాట్లు, వివిధ కులాలకు సామాజిక భవనాల నిర్మాణంపై గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు ఏం చెప్పుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. గ్రామాల్లో ఉండే అధికార పార్టీ చోటామోటా లీడర్లు కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తమ వర్గాలకు ఏం చేయలేదనే భావనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది. కొన్నిచోట్ల ఏం చేసేది లేక.. ఉపాధి హామీ పనులను తామే అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నామని ఒక ఎమ్మెల్యే వాపోయారు.

పనులు పూర్తి చేస్తలే.. ఫండ్స్ ఖర్చుపెడ్తలే

2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో రాష్ట్రంలో 42,730 పనులను మంజూరు చేశారు. నిరుటి వరకు వీటిలో 27,441 పనులు 64 శాతమే పూర్తి చేసినట్లు పోయిన మార్చిలో కాగ్ తన రిపోర్ట్​లో వెల్లడించింది. తమకు అనుకూలమైన వారికి పనుల బాధ్యతలను అప్పగించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనుల విలువను రూ.5 లక్షల కంటే తక్కువగా విభజించి, టెండర్ ప్రక్రియ లేకుండా చేసినట్లు పేర్కొంది. ఒక్కో పని రెండేండ్లకు పైగా కొనసాగడాన్ని తప్పుపట్టింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేండ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ కింద రూ.1,900 కోట్లు విడుదల చేసింది. అయితే వీటిలో కేవలం రూ.1,228.93 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఆ తరువాత 2020–21, 2021–22లలో కరోనా కాలంలో ఖర్చు చేసిన మొత్తం కూడా తక్కువగానే ఉన్నది. ఈ కాలంలో  రూ.600 కోట్ల లోపు ఖర్చు చేశారని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.