
- కారేపల్లిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు
కారేపల్లి, వెలుగు: తడిసిన పత్తిని కూడా మద్దతు ధరతోనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ నాయక్, కోరం కనకయ్య అన్నారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల ఈ ఏడాది పత్తి పంట దిగుబడి బాగా తగ్గిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీఐ వారు రూ.8110 మద్దతు ధరతో కొనుగోళ్లు చేయాలన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నెలరోజుల ముందుగానే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, అగ్రికల్చర్ ఏడీఏ కరుణశ్రీ, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ నరేశ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, బానోత్ రామ్మూర్తి, అడ్డగోడ ఐలయ్య, తోటకూరి శివయ్య, ఫతేమహమ్మద్, మేదరి టోనీ, సపావట్ నాగులు, మేదరి రాజా, హీరాలాల్ పాల్గొన్నారు.