పార్టీ ఫిరాయింపులపై మీరా నీతులు చెప్పేది? :  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి

పార్టీ ఫిరాయింపులపై మీరా నీతులు చెప్పేది? :  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
  • బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​, ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్​ఎస్​ నేతలు నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్​ నేతలు విమర్శించారు. ‘‘2014లో ఇతర పార్టీల నుంచి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలను, 2018లో ఇతర పార్టీల నుంచి గెలిచిన 19మంది  ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్ఎస్​ నేతలు.. ఇప్పుడు నీతులు చెప్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్​కు పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ  ఎందుకు ఫిరాయింపులకు పాల్పడాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి?” అని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం సీఎల్పీలో వేర్వేరుగా మీడియా సమావేశాల్లో మాట్లాడారు.

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, స్పీకర్ కు సుప్రీంకోర్టు కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సభా హక్కులను కాపాడేది స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని తెలిపారు. బీఆర్​ఎస్​కు అనుకూలంగా తీర్పువచ్చినట్లు ఆ పార్టీ నేతలు సంకలు గుద్దుకోవడం వారి తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు. ‘‘బీఆర్ఎస్ నాయకులు ముందుగా సుప్రీంకోర్టు తీర్పును చదువుకొని, ఆ తర్వాత మాట్లాడాలి.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు పార్టీలనే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్ ది” అని ఆయన వ్యాఖ్యానించారు.  రాజ్యాంగ వ్యతిరేక శక్తి బీఆర్ఎస్​అని మండిపడ్డారు.  ‘‘తెలుగుదేశంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకొని మంత్రులుగా చేసిన చరిత్ర కేసీఆర్ ది. తెలంగాణలో కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ కూల్చింది. సీఎల్పీ నేతగా ఒక దళిత నేత ఉంటే సహించలేక కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని ఏకంగా బీఆర్ఎస్ లో కేసీఆర్​ విలీనం చేసుకున్నడు. ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేసిండు.

ఎమ్మెల్యే నుంచి కిందస్థాయి నాయకుల వరకు బీఆర్ఎస్  ఫిరాయింపులను ప్రోత్సహించినా కాంగ్రెస్ నిలబడి అధికారంలోకి వచ్చింది” అని ఆయన తెలిపారు. ‘‘పీసీసీ మాజీ అధ్యక్షులను కూడా కేసీఆర్ తన పార్టీ లో చేర్చుకున్నడు. తెలంగాణలో తెలుగుదేశం ఉండొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ .రమణ ను బీఆర్ఎస్ లో చేర్చుకున్నడు. అలాంటిది ఇప్పుడు సిగ్గులేకుండా నారా లోకేష్  తనకు తమ్ముడు అని కేటీఆర్ మాట్లాడుతున్నడు. కమ్యూనిస్టు పార్టీలను కూడా ఖతం చేయాలని కేసీఆర్ ప్రయత్నించిండు. మేం కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించాం” అని పేర్కొన్నారు.

పిటిషన్​ వేసిన వివేకానంద కూడా ఫిరాయింపుదారుడే

ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందనే స్వయంగా ఫిరాయింపుదారుడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ‘‘వివేకానంద గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిండు.  2014 లో బీఆర్ఎస్ తరుపున 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ సంఖ్య 90కి ఎలా చేరింది? 2018 లో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చినా ఫిరాయింపులను ప్రోత్సహించింది.  2018 లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 12 మందిని బీఆర్ఎస్​లో చేర్చుకున్నరు” అని తెలిపారు.

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్​ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని, బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల అనర్హత అంశం మీద అప్పటి స్పీకర్లు స్పందించలేదని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించి ప్రయోజనాలు పొందిన వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టని పేర్కొన్నారు.