గోదావరిని కేసీఆర్ ఫాంహౌజ్కు తరలించుకుపోయిండు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

గోదావరిని కేసీఆర్ ఫాంహౌజ్కు తరలించుకుపోయిండు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం అవినీతి మయంగా మారిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉచిత విద్యుత్కు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్  పార్టీ విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడిపిందని చెప్పారు.  కానీ నేడు విద్యుత్ సంస్థల్లో రూ. 21వేల కోట్ల బకాయిలు ఏర్పడ్డాయని విమర్శించారు. తమ తప్పులను కప్పి పుచ్చుకొని కేవలం ప్రకటనల ద్వారానే తెలంగాణ ప్రభుత్వం కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే చేసిందేమి లేదని విమర్శించారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి...అనేక రాయితీలను తీసేశారని వెల్లడించారు. రైతు బంధుతో పాటు..రైతులకు వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గోదావరి నీటిని ఫాంహౌజ్కు తరలించుకపోయారని..కానీ ఎగువ మానేరును మాత్రం నింపలేకపోయాడని చురకలంటించారు. 

డ్రగ్స్ కేసును సరైన విధంగా విచారించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెండు ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే డ్రగ్స్ కేసును సరైన విధంగా విచారించాలన్నారు.  కేటీఆర్, బండి సంజయ్ ఒకరినొకరు దూషించుకుంటూ పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  సెస్ లో అవినీతి జరిగిందన్నారు. సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో మనస్పర్ధలు కామన్ అని చెప్పారు. వాటిని బీఆర్ఎస్ పార్టీ భూతద్ధంలో చూపెట్టాలని చూస్తోందన్నారు.