బాసరకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్

 బాసరకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్

నిర్మల్ జిల్లా: బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలియజేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాహనాన్ని నిలిపేసిన పోలీసులు బాసరకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. అక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తే అరెస్టు చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాగ్వాదం చేసినా పోలీసులు వినిపించుకోలేదు. జీవన్ రెడ్డిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. 
గత నాలుగు రోజులుగా వర్షం పడుతున్నా.. బాసర విద్యార్థులు వేలాది మంది వర్షానికి తడుస్తూనే నిరసన కొనసాగిస్తున్నారు. బాసర ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో జైలు కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాల నాయకులు తీవ్రంగా స్పందించారు. బాసర విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్ష నేతలే కాదు.. అన్ని వర్గాల నుండి అనూహ్య మద్దతు పెరగడంతో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బాసరకు వెళ్లాలని ప్రయత్నించిన నేతలందరినీ పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించి అరెస్టులు చేయగా.. తాజాగా కొద్దిసేపటి క్రితం నిర్మల్ జిల్లా నర్సాపూర్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేశారు.