కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
  • ఈపీసీ లేకపోవడంతోనే అప్పులపాలు
  • మారకుంటే ఎన్నికల్లో  డిపాజిట్ రావు 
  • కేటీఆర్​ది ఆత్మస్తుతి పరనింద
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్​: ఇప్పటికైనా మారకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు కూడా డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  ఇప్పటికైనా కేటీఆర్​ఓటమిని ఒప్పుకోవాలని సూచించారు. గాంధీభవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్​, కేటీఆర్​పై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్​ అయ్యారు.  రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ఓటమి చెందడంపై కేటీఆర్ చెబుతున్న మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు. వాళ్లు అధికారంలో  ఉన్నప్పడు పనులు తప్ప  ప్రచారం చేసుకోలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.  

కమీషన్ ల కక్కుర్తితోనే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం రీ డిజైన్, పవర్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లో  భారీ కుంభకోణం జరిగిందన్నారు. రాజశేఖర్ హయాంలో ఈపీసీ విధానంలో ప్రాజెక్టు పనులు చేసేవాళ్లన్నారు. కానీ కేసీఆర్ హయాంలో ఈపీసీ విధానం తొలగించి పనులు కట్టబెట్టారని ఆరోపించారు. 

ఈ విధానం లేకపోవడం వల్లే  రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా మార్చి ఖర్చు చేశారన్నారు. అన్నింటిని పక్కదారి పట్టించడానికి దళిత బంధు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కేంద్రం సహకరిస్తలేదని కేంద్రాన్ని బద్నామ్ చేసే పని ముందేసుకున్నాడన్నారు.ఎస్టీలను ఆగం చేసింది కేసీఆరే అని మండిపడ్డారు. 

నిరుద్యోగ యువతకు ఏంచేశారో  కేటీఆర్ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని ఆయన హితవు పలికారు. సమీక్షా సమావేశాల్లో ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారం  ఉందని ఎద్దేవా చేశారు. జరిగిన పొరపాట్లను సవరించుకోవాలని సూచించారు. కుటుంబ పాలన నుంచి బయటికు రావాలన్నారు. ఇన్నాళ్లు ప్రజలను భయపెట్టి ఇక్కడి వరకు వచ్చారన్నారు. బీఆర్​ఎస్​ అభ్యర్థిని మార్చడంకాదు.. అధినాయకున్నే ప్రజలు మార్చారని ఆయన ఎద్దేవా చేశారు.