కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి కొనసాగిస్తాం

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి కొనసాగిస్తాం

కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని  ప్రజలకు వివరించాలని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలో ఉప్పరిపేట్ వీధిలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన వాగ్దానం ఒక్కటైనా నెరవేర్చారా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ ఏర్పడి 7, 8 ఏండ్లు గడుస్తున్నా ఒక ఇల్లు కూడా కట్టించలేదని అన్నారు. రాష్ట్రంలో  ఇందిరమ్మ ఇల్లు  లేని గ్రామం ఉంటే.. ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓటు అడగదన్నారు. డబుల్ బెడ్ రూం లేని ఊర్లలో TRS నాయకులకు ఓటు అడిగే హక్కు లేదన్నారు జీవన్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి కొనసాగిస్తామన్నారు. దానితో పాటు నూతన జంటకు ఇంటి నిర్మాణం కోసం  రూ.5 లక్షల చెక్కు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు  రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇప్పించిందన్నారు‌.  రైతుల కోసం రైస్ మిల్లర్లతో కొట్లాడింది నేను..ఇప్పుడు రైస్ మిల్లర్లు జీవన్ రెడ్డి పై నిండా కోపంతో ఉన్నారని అన్నారు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే మిల్లర్లు అందరూ ఒక్కటై 10 కోట్లు పెట్టి జీవన్ రెడ్డి సంగతి ఏంటో చూడాలని అనుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తానా? చేయనా? పోటీ చేస్తే గెలుస్తానా? గెలువనా? తర్వాత ముచ్చట అని అన్నారు. నేను చదువుకునోన్ని..రాజ్యాంగ పరంగా మనకున్న హక్కుల  కోసం ఏ పదవి  ఉన్నా, లేకున్నా పోరాడుతానని తెలిపారు.

1971 లో పాకిస్తాన్ తో ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఇందిరా గాంధీ ఆ దేశాన్ని తునకలు తునకలు చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసారని.. భారతదేశం అంతర్భాగంలో చైనా దురాక్రమణ చేసి  ఇండ్లు కడుతుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భారతమతాకు జై అని నైతిక హక్కు మాకే ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.