కేటీఆర్ ట్విట్టర్‌కి మాత్రమే స్పందిస్తాడా?

కేటీఆర్ ట్విట్టర్‌కి మాత్రమే స్పందిస్తాడా?
  • కేసులు పెరగడానికి సాగర్ ఎన్నికలే కారణం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభణ
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలి
  • ఆయుష్మాన్ భారత్‌ను ఎందుకు అమలు చేయడం లేదు?
  • ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే దేశంలో, రాష్ట్రంలో కరోనా సెంకండ్ వేవ్ తీవ్రమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువ కావడానికి నాగార్జున సాగర్ ఎన్నికలే కారణమని ఆయన ఆరోపించారు. మన దేశం అగ్రదేశాలతో సమానంగా ముందంజలో ఉన్నా.. కరోనా విషయంలో మాత్రం వెనకపడిపోయిందని.. దాంతో దాయాది దేశాలు భారతదేశం పట్ల సానుభూతి తెలిపే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తిపై జీవన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ‘కరోనా టెస్టులు కనీసం 25% కూడా నిర్వహించడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల ఒక్కడు పది మందికి అంటుపెడుతుండు. కనీసం ప్రాణ వాయువు అందించలేని పరిస్థితుల్లో తెలంగాణా సర్కారుంది. హాస్పిటల్‌లో అడ్మిటైతే డిశ్చార్జయ్యే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి సహాయ, సహకారాలు తీసుకోలేకపోవడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం. ఏమన్నా అంటే తెలంగాణ నేనే తెచ్చానని చెప్పుకోవడం తప్ప ఇంకేమీలేదు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌కి మాత్రమే స్పందిస్తాడా? ఎక్కడో ఆంధ్రాలో కోవిడ్ వచ్చిన వ్యక్తి తన ఇబ్బంది గురించి ట్వీట్ పెడితే రెమిడెసివిర్ మెడిసిన్ అందించాడు. కేటీఆర్‌కి ఆంధ్రాలో జరుగుతున్న సమస్యలు మాత్రమే కనపడుతాయా? తెలంగాణ ప్రజల సమస్యలు కనపడవా? ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకింకా అమలు చేయడం లేదు? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో తెలంగాణా ప్రజలు ఉచిత వైద్యసేవలకు దూరమైపోతున్నారు. కార్పొరెట్ హాస్పిటల్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్  దోచిపెడుతున్నాడు. ఉచిత వైద్యం కల్పించడమనేది రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కు. కరోనా విజృంభణకు పూర్తి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే. కోవిడ్ ట్రీట్మెంట్ ఖర్చులను మొత్తం ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి’ అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.