దళితులకు మూడెకరాలిచ్చిన్రా.. కాంగ్రెస్ హయాంలోనే దళిత సంక్షేమం

దళితులకు మూడెకరాలిచ్చిన్రా.. కాంగ్రెస్ హయాంలోనే దళిత సంక్షేమం

హైదరాబాద్, వెలుగు: దళిత సంక్షేమం కాంగ్రెస్​ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దళితులకు భూములు పంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్​పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ దళితులకు ఎన్ని ఇండ్లు కట్టించిందని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమిని పంచుతామని చెప్పి పంచారా అని నిలదీశారు. దళిత బంధు అర్హులకు అందించలేని అసమర్థ పాలన బీఆర్ఎస్​దని మండిపడ్డారు. దళితబంధు లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో ప్రభుత్వం ఇప్పటికీ చెప్పడం లేదన్నారు. మూడేండ్లలో ఎంతమంది దళితులు, బీసీలు, మైనారిటీలకు ఆర్థిక సాయం అందించారో వైట్​పేపర్ రిలీజ్ చేయాలన్నారు. 

కేసీఆర్​ మొదటి నాలుగేండ్లు కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేశారని, చివరి ఏడాది ప్రజల కోసమంటూ హంగామా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కరికి కూడా కేసీఆర్ సర్కార్ కొత్త రేషన్ కార్డును ఇచ్చింది లేదని మండిపడ్డారు. జనాభా ప్రకారం దళితులకు రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. తాము పెంచుతామంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు.