గిరిజనులు కోల్పోయిన 4 % పోస్టులు భర్తీ చేస్తం

గిరిజనులు కోల్పోయిన 4 % పోస్టులు భర్తీ చేస్తం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనులు కోల్పోయిన నాలుగు శాతం పోస్టులను భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మోసం వల్ల  గత 8 ఏళ్లుగా రాష్ట్రంలోని గిరిజనులు నష్టపోయారని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై ఇన్నేళ్లు ఎందుకు జాప్యం చేశారని  ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపాన్ని నెట్టేసి కేసీఆర్ కాలయాపన చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు అంశంతో కేంద్రానికి సంబంధం లేకున్నా.. కేంద్రం పేరు చెప్పి కేసీఆర్ మోసం చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాశారన్నారు. ఇంత ఆలస్యంగా ఇప్పుడు రిజర్వేషన్లను పెంచి.. టీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు.. రాష్ట్రం పంపిన ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఎందుకు వెనక్కి పంపలేదని ప్రశ్నించారు. ఈ బిల్లును దగ్గర పెట్టుకొని కేంద్ర సర్కారు కూడా మోసం చేసిందన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేసి గిరిజనుల ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.