జీవన్ రెడ్డికి బాండ్ రాసే పరిస్థితి ఎందుకొచ్చింది : కల్వకుంట్ల కవిత

జీవన్ రెడ్డికి బాండ్ రాసే పరిస్థితి ఎందుకొచ్చింది : కల్వకుంట్ల కవిత

జగిత్యాల, రాయికల్‌, వెలుగు: బాండ్ పేపర్ రాసి.. దేవుడి ముందు సంతకం చేసినా కాంగ్రెస్​ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డిని జనాలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.  50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన.. ప్రజా అవసరాలు ఆలోచించి అభివృద్ధి చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మద్దతుగా జగిత్యాలలో నిర్వహించిన సభలో కవిత మాట్లాడుతూ అనేకసార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డి జగిత్యాలకు చేసిందేమీ లేదని, దొంగ బాండ్ పేపర్లను నమ్మి జనాలు మోసపోవద్దని కోరారు.

గత ఎన్నికల్లో జగిత్యాలలో సంజయ్ గెలుపుతోనే బీఆర్ఎస్​ ప్రభంజనం మొదలైందన్నారు. జగిత్యాలను జిల్లాగా, బీర్పూర్‌‌ను మండలంగా చేసుకున్నామని, 4 వేల డబుల్ ఇండ్లు నిర్మించుకున్నామన్నారు. ప్రజల కోరిక మేరకు జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను ఎప్పుడో రద్దు చేశామని, జనాలకు జీవన్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  అంతకుముందు రాయికల్​ మండలంలోని పలు గ్రామాల్లో  ఎమ్మెల్యే సంజయ్​కుమార్ ​ప్రచారం నిర్వహించారు.