ఈడీ కస్టడీలో కవిత దినచర్య..భగవద్గీత.. ధ్యానం

ఈడీ కస్టడీలో కవిత దినచర్య..భగవద్గీత.. ధ్యానం
  •     ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష
  •     ఉదయం, మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు
  •     మరోసారి కవితను కలిసిన కేటీఆర్​.. ఇవాళ భేటీకానున్న తల్లి శోభ

న్యూఢిల్లీ, వెలుగు :  లిక్కర్​ స్కామ్​ కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. గీతా పఠనం, భగవన్నామస్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి  సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లు అందించారు. అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన ‘కరుణా నిధి – ఏ లైఫ్’, శోభన కే నాయర్ రాసిన ‘రాం విలాస్ పాశ్వాన్ – -ది వెదర్వాన్​ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు. 

స్వామి సర్వప్రియానంద రాసిన ‘భగవద్గీత’ పుస్తకాన్ని కూడా తెప్పించుకొని దినచర్యలో భాగంగా కవిత  చదువుతున్నారు. పుస్తకాల్లోని అంశాలను డైరీలో నోట్​ చేసుకుంటున్నారు. ఇతర కేసుల్లో బిజీగా ఉన్నందున ఈడీ ఆఫీసర్లు.. కవితను బుధవారం ఉదయం 10 గంటల తర్వాత కొద్దిసేపు విచారించారు. అనంతరం మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత కాసేపు ప్రశ్నించారు. 

కవిత పీఏ, సిబ్బందిని ప్రశ్నించిన ఈడీ

ఈ నెల 15న  హైదరాబాద్​లోని కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు, కవిత మీడియా పీఆర్వో, ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 16 మంది ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోన్​ నంబర్లతో పాటు వాటికి సంబంధించిన ఫోన్ పాస్ వర్డ్స్ ను పేపర్ పై నమోదు చేసుకుంది. అయితే ఈ 16 ఫోన్లలో ర్యాండమ్ మోడ్ లో ఐదుగురి ఫోన్లను ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనా ఎంపిక చేసి స్వాధీనం చేసుకున్నారు. మిగితా 11 ఫోన్లను వెంటనే తిరిగి ఇచ్చారు. ఈడీ స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కవితతో పాటు, ఆమె భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, పీఏ శరత్ కుమార్, సిబ్బంది రోహిత్ రావు ఫోన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కవిత విచారణ సందర్భంగా ఆమె పీఆర్వో రాజేశ్, సిబ్బంది రోహిత్ రావు ను బుధవారం ఈడీ పిలిచింది. వీరిద్దరు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఈడీ ఆఫీసుకు రాజేశ్, రోహిత్  చేరుకున్నారు. వీరిని ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కవిత దగ్గర పీర్వో గా రాజేశ్ సుదీర్ఘ కాలంగా పని చేస్తుండగా... రోహిత్ రావు మాత్రం మూడు నెలల కిందనే ఆమె దగ్గర చేరినట్లు తెలిసింది. 

మరోసారి కవితను కలిసిన కేటీఆర్​

ఈడీ కస్టడీలో ఉన్న కవితను నాలుగో రోజు కూడా కేటీఆర్ కలిశారు. తొలి రోజు అనిల్, హరీశ్​రావుతో కలిసి వెళ్లిన కేటీఆర్.. మూడు, నాలుగు రోజుల్లో మాత్రం కేవలం అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకొని కవితను కలిశారు.  ఈ సందర్భంగా.. విచారణ వివరాలను తెలుసుకుంటూ న్యాయపరంగా సహకారం అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో  తీసుకుంటున్న స్టెప్స్​ను వివరిస్తూ ఆమెకు ధైర్యం చెప్తున్నారు. కాగా, కస్టడీలో ఉన్న కవితను గురువారం ఆమె తల్లి శోభ కలువనున్నట్లు తెలిసింది.